Credits: Shri Yandamoori Veerendranath
ఈ క్రింది సూత్రాల ఆచరణ మొదట్లో కష్టంగా తోస్తుంది. ఒకసారి అలవాటయ్యాక 'చదువు ఇంత సులువా! విజయం ఇంత బావుంటుందా! అనిపిస్తుంది. గెలుపు భవంతి మొదటి మూడు మెట్లెక్కడమే కష్టం. పై మెట్టు చేరేసరికి మిగతావాళ్ళంతా క్రిందుంటారు. అప్పుడు అలసట ఉండదు. మీ మీద మీకు నమ్మకం, ఉత్సాహం కలుగుతాయి.
⮚
తెల్లవారుజాముని 'బ్రహ్మ సమయము' అంటారు. ఆ నిశ్శబ్ద, శీతల, ప్రత్యూష సమయంలో ఏకాగ్రత బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రతిరోజూ తెల్లవారుజామున క్రమం తప్పకుండా కనీసం అరగంటైనా చదవండి.
⮚
ఉదయాన్నే లేవగానే అద్దం దగ్గరకి వెళ్లి అయిదు సెకన్లు మొహాన్ని చూసుకుని 'ఎంత బావున్నావే సుబ్బలక్ష్మీ' అనుకుంటూ నవ్వుకోండి. నవ్వినప్పుడు మెదడులో విడుదలయ్యే హార్మోన్ రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. మీరే మీ మీద గర్వించాలి. ఒంటరిగా ఉన్నపుడల్లా ప్రశాంతంగా నవ్వుకోండి. పదిమందిలో మాత్రం ఈ పని చేయకండి.
⮚
ఏ వస్తువు ఎక్కడుండాలో అక్కడ ఉంచుకోవటం నుంచీ, వస్త్రాలను సర్దటం వరకూ క్రమశిక్షణే. సమయపాలన క్రమశిక్షణకి మొదటి మెట్టు. ఒకే సమయానికి చదువు ప్రారంభించి, ఒకే సమయానికి నిద్రపోయే విద్యార్థి సగం విజయం సాధించినట్టే.
⮚
ఎక్కువసేపు చదవకండి. మనసు పూర్తిగా ఏకాగ్రతను కోల్పోతుంది. సాధారణంగా 20 నుంచి 50 నిమిషాల దాకా ఏకాగ్రత కొనసాగుతుంది. తర్వాత తగ్గిపోతుంది. అప్పుడు చదువు ఆపండి.
⮚ గోడకి ఆనుకుని చదవవద్దు. వెన్నెముక నిటారుగా పెట్టి కూర్చుని చదవటం మంచిది. చదివే స్థలాన్ని తరచుగా మార్చవద్దు. పడుకొని అస్సలెప్పుడూ చదవొద్దు. గోడ వైపు తిరిగి తల దించుకుని చదువుకోండి.
⮚
చదవాలి కాబట్టి బలవంతంగా చదవకండి. నిద్రొస్తే కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి. కానీ ప్రతిరోజూ ఈ అలవాటు చేయకండి. అలసిపోయినప్పుడు గంటా రెండు గంటలు విశ్రాంతి తీసుకుని, ఆపై ఉత్సాహంగా లేచి చదవండి. కళ్లకు మంట అనిపిస్తే, తడి దూది లేదా కీరా పెట్టుకుని విశ్రాంతి తీసుకుని చదవండి.
⮚
పుస్తకం వెనుక వాతావరణం కూడా మన కళ్లపై ప్రభావం చూపుతుంది. నలుపు లేదా తెలుపు రంగులు కళ్లను త్వరగా అలసటకు గురి చేస్తాయి. పసుపు రంగు మన దృష్టికి మేలు చేస్తుంది. పసుపు రంగు టేబుల్ క్లాత్ వాడండి.
⮚
ఎడమచేతి బొటనవేలితో కుడివైపు నాసిక మూసి గాఢంగా గాలి పీల్చండి. తరువాత రివర్సులో మళ్ళీ అలాగే చేయండి. అయిదు నిమిషాల్లో ఊపిరితిత్తులు శుభ్రంగా తయారవుతాయి. మెదడు ఉత్సాహంగా మారుతుంది. కుడి మెదడు తెలివికీ, ఎడమ వైపు జ్ఞాపకశక్తికీ నెలవు అంటారు. రెండు మెదళ్ళూ శక్తివంతమవుతాయి. కొత్త హుషారు వస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ రోజే చేసి చూడండి. మీకు వెంటనే ఆ తేడా తెలుస్తుంది.
⮚
చదువు ప్రారంభానికి ముందు మొహం శుభ్రంగా కడుక్కొని చదవడం మంచిది.
⮚
చదువుకునేటప్పుడు చెవులకి ఇయర్-ప్లగ్స్ లేదా దూది పెట్టుకోవటం అలవాటు చేసుకోండి. సౌండ్ డిస్టర్బెన్స్ తగ్గే కొద్దీ కాన్సెంట్రేషన్ పెరుగుతుంది.
⮚
నోటితో కాకుండా కళ్లతో చదవటం ప్రాక్టీసు చేయండి. గట్టిగా చదవటం క్రమంగా తగ్గించుకోండి. పెద్దయ్యాక హాస్టల్లో ఉండవలసి వస్తే అది పక్కవాళ్ళకి డిస్టర్బెన్స్. మీకు కూడా సిగ్గుగా ఉంటుంది.
⮚
ప్రపంచ, దేశ, రాష్ట్ర పటాలు గదిలో అతికించుకుని, నగరాలు, నదులు, పర్వతాలు ఎక్కడెక్కడున్నాయో చూసి తెలుసుకోండి. ఇలా చేయడం వల్ల అర్థం చేసుకోవడం సులభమవుతుంది. ఉత్సాహంగా ఉంటుంది. జ్ఞానం వస్తుంది.
⮚
భౌతిక శాస్త్ర, రసాయన శాస్త్ర సూత్రాలు గోడకి అతికించండి. కొంత కాలానికి మీకు తెలియకుండానే అవి బై-హార్ట్ అయిపోతాయి.
⮚
చల్లటి, సువాసనా భరితమైన గదిలో కూర్చుని చదువుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది.
⮚
అనవసరమైన సంభాషణలు తగ్గించుకోండి. వీలైనంతవరకు మౌనంగా ఉండే అలవాటు చేసుకోండి. మౌనం మనలో ఉన్న అతి ముఖ్యమైన శక్తిని బయటకు తెస్తుంది.
⮚
మెదడులోని పదివేల కోట్ల పైగా న్యూరాన్లలో అయిదు లక్షలు 'Active'గా ఉంటాయి. అంటే ఒక వ్యక్తి... తన పాఠాలు, సినిమాల పేర్లు... అలా 5 లక్షల దాకా గుర్తుపెట్టుకోగలడన్న మాట. ఒక కొత్త విషయం మెదడులోకి ప్రవేశిస్తే, అది అక్కడ ఉన్న ఒక పాత విషయాన్ని 'డెడ్' విభాగానికి తోసేస్తుంది. ఏదైనా సినిమా, లేదా నటుడి గురించి వాదించేటప్పుడు ఎక్కడో నిద్రపోతున్న జ్ఞాపకాల్ని (న్యూరాన్స్ని) మేల్కొల్పాలి. దానివల్ల ఆ న్యూరాన్లు 'చురుకు' విభాగానికి వస్తాయి. అక్కడున్న (చదువు తాలూకు) న్యూరాన్లు విశ్రాంతి (డెడ్) విభాగానికి వెళ్తాయి. దాన్నే 'మర్చిపోవటం' అంటారు. అందుకే అనవసర సంభాషణలు, అనవసరమైన విషయాలపై అత్యుత్సాహాలు తగ్గించుకోమనేది..! చదువు పట్ల ఆకర్షణ పెంచి, దాని ద్వారా ఏకాగ్రత సాధించగలిగే మొట్ట మొదటి సూత్రం... వీలైనంత సేపు, అవసరం లేనప్పుడు మౌనంగా ఉండగలగటం! అదే ఖచ్చితమైన, సులభమైన, ఏకైక మార్గం!
⮚
అతి వాగుడు విద్యార్థికి ఏ సైకాలజిస్టూ ర్యాంకు తెప్పించలేడు. అనవసర విషయాలకి మెదడులో ఎక్కువ స్థలం కేటాయించటాన్ని 'గార్చేజి స్పేస్' (చెత్తకుండి) అంటారు. రోజూ సాయంత్రం ఒక అరగంట సేపు ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండండి. అప్పుడు నిశ్శబ్దం మీతో మాట్లాడుతుంది. గొప్ప అనుభవం అది.
⮚
రోజంతా చదివింది పడుకోబోయే ముందు పది నిముషాలు రివిజన్ చేసి, పుస్తకం పక్కన పడేసి, ఆ పై ఎవరితో మాట్లాడకుండా వెంటనే నిద్రపోండి. ప్రొద్దున్నకి అవి పెర్మనెంట్ బాండ్స్ గా మారతాయి. నెల రోజులు దీన్ని ఆచరిస్తే ఆ ప్రభావం ఎంత గొప్పదో మీకు తెలుస్తుంది.
⮚
చదువుకుంటున్న సమయంలో ఏదైనా ఆలోచన పక్కదారి పట్టిస్తే ఆ టాపిక్ ఒక కాగితం మీద వ్రాసుకొని పక్కన పెట్టుకోండి. ఇక ఆ విషయం గూర్చి మర్చిపోయి తిరిగి చదువుకోండి. 'వర్రీ టైమ్'లో తీరిగ్గా కూర్చొని అలా వ్రాసుకున్న లిస్ట్లో ఒక్కొక్క టాపిక్ గురించి ఆలోచించటం ప్రారంభించండి. అప్పటికి ఆ విషయం తాలూకూ సాంద్రత/ప్రాముఖ్యత తగ్గిపోయి ఆలోచించటానికి ఏమీ మిగలదు.
⮚
పాఠాన్ని చిన్న చిన్న పాయింట్ల రూపంలో వ్రాసుకోండి. తరువాత ఆ పాయింట్లని 'మీ భాషలో” తిరిగి వివరంగా వ్రాయండి. అంతే! మొత్తం పాఠం అంతా మీ మెదడులో ప్రింట్ అయిపోతుంది. టీచర్ రామాయణం చెప్తున్నాడనుకోండి. రామ, సీత, రావణ, కిడ్నాప్ అని రాసుకోండి. తరువాత నాలుగు పదాల్నీ విస్తరించండి. రాముడు, సీత అడవికి వెళ్ళారు. రాముడి తమ్ముడు శూర్పణఖ ముక్కూ చెవులు కోసాడు. శూర్పణఖ వెళ్ళి అన్న రావణాసురుడికి చెప్పింది. రావణాసురుడు వచ్చి సీతను అపహరించాడు...! దీన్నే 'కీ-నోటింగ్' అంటారు. దీనివల్ల రెండు లాభాలు ఉన్నాయి. మెదడులో ఖాళీ స్పేస్ ఎక్కువ మిగులుతుంది. పదాలను విస్తారం చేసినప్పుడు మీకు భాష పై పట్టు వస్తుంది.
⮚
ఖాళీగా ఉంటే మెదడు తనని తాను తినేస్తుంది. నిరంతరం దానితో ఎక్సర్సైజ్ చేయించండి. 18ని 13తో మనసులో హెచ్చవేయటం, సూపర్ మార్కెట్లో కొన్న వస్తువుల ధర చూసి మొత్తం ఎంతవుతుందో లెక్కకట్టి చివర్లో సరిచూసుకోవటం, తొమ్మిదో ఎక్కం వెనుక నుంచి చదవటం, Z నుంచి గA వరకూ చెప్పటానికి ప్రయత్నం చెయ్యటం, కళ్ళు మూసుకొని మీ గదిలో ఏయే వస్తువులు ఉన్నాయో గుర్తు తెచ్చుకుంటూ వ్రాయటం మొదలైనవన్నీ మెదడుని నిరంతరం చురుగ్గా ఉండేలా చేస్తాయి.
⮚
పరీక్షల ముందు ఏం చదవాలా, ఎలా రివైజ్ చెయ్యాలా అని కంగారు పడవద్దు. వారం రోజుల ముందే ఒక టైమ్ టేబుల్ వేసుకుంటే టెన్షన్ ఉండదు. రివిజన్ చేస్తున్నప్పుడు “ఇష్టమైన” కాకుండా “కష్టమైన” సబ్జెక్ట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మీకు మీరే తరచు మాక్ పరీక్షలు పెట్టుకోండి. పాత ప్రశ్నాపత్రాలకి ఆన్సర్లు వ్రాయండి.
⮚
ఒకే సబ్జెక్ట్ని ఎక్కువసేపు రివైజ్ చెయ్యవద్దు. గంట చాలు. 'రివిజన్' అంటే పైపైన చదివేసి “హమ్మయ్య అయిపోయింది” అనుకోవడం కాదు. సబ్జెక్ట్ని చివరిసారి బ్రష్ చేసుకోవటం. రివిజన్ చేస్తున్న సమయంలో అప్పటివరకూ చదవని టాపిక్ అకస్మాత్తుగా కనపడవచ్చు. కంగారు పడకండి. దాన్ని గుర్తుంచుకోవటానికి ప్రయత్నం చెయ్యండి తప్ప, ఆఖరి నిముషంలో కంఠతా పట్టడానికి ట్రై చేస్తే ఆ కంగారులో ముందు చదివింది కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది.
⮚
పరీక్షల సమయంలో కొందరికి తొందరగా నిద్ర పట్టదు. దాంతో పొద్దున్న ఆలస్యంగా నిద్ర లేవటం జరుగుతుంది. అలారం ఉన్నా నిద్రలోనే ఆపుతారు. దీనికో టెక్నిక్ ఉంది. అలారం మంచానికి దూరంగా పెట్టుకోండి. దాని పక్కనే నీళ్ళు గ్లాసు ఉంచుకోండి. మోగుతూన్న అలారం ఆపాలంటే గడియారం వరకూ నడచి వెళ్లక తప్పదు. అక్కడ నీళ్ళతో మొహం తడి చేసుకోవటం ద్వారా మత్తు నుంచి బయటకు రండి.
⮚
'మేము తెల్లవారే వరకూ చదివాము, రాత్రంతా నైట్-అవుట్ చేసాము” అని మీ స్నేహితులు చెప్తూ ఉండవచ్చు. డిప్రెస్ అవ్వొద్దు. అది వాళ్ళ అలవాటేమో. మీకు కాకపోవచ్చు. శుభ్రంగా చదివి, హాయిగా టైమ్కి నిద్రపోవటం మీ ఆరోగ్యకరమైన అలవాటు. దాన్నే కంటిన్యూ చెయ్యండి. పరీక్షల ముందు అకస్మాత్తుగా మీ అలవాట్లను మార్చుకోవద్దు.
⮚
పరీక్షలు దగ్గరపడుతున్న 4 దశల్లో టెన్షన్ పెరుగుతుంది. 1. ఇంకో నెల రోజుల్లో పరీక్షలు మయొదలవుతాయనగా పుస్తకాల ముందు కూర్చున్నప్పుడు అసౌకర్యం, ఒంటరితనం, అభద్రతా భావం ప్రారంభమవుతాయి. మనం తప్ప ప్రపంచంలో అందరూ సంతోషంగా ఉన్నారన్న భావన కలుగుతుంది. 2. పరీక్ష వారం రోజులుందనగా ప్రొద్దున్న లేవగానే దిగులుగా ఉండటం మొదలవుతుంది. 3. మూడు రోజుల ముందు నుంచీ నిద్ర సరిగ్గా పట్టదు. 4. పరీక్ష రోజు నవ్వు, ఆనందం తగ్గుతాయి. ఈ సమస్యల నుండి బయటపడాలంటే స్కూలు/కాలేజి ప్రారంభమైన మొదటి రోజు నుంచీ చదవండి.
⮚
ప్రశ్నా పత్రం అందుకుంటున్నప్పుడు 'తల్లిదండ్రులు మన మీద పెట్టుకున్న ఆశ, ఉపాధ్యాయుల నమ్మకం... వీటిని సరిగ్గా నిర్వర్తించగలమా' అన్న అనుమానంతో టెన్షన్ ఎవరెస్ట్ శిఖరం చేరుకుంటుంది. క్వశ్చన్ పేపరు నవ్వుతూ చదవండి. 'ఇదేమిటి? L.K.G. పేపరులా ఇంత ఈజీగా ఉందేమిటి?” అనుకోండి. పేపరు కష్టంగా ఉంటే తరువాత ఎలాగూ బాధపడవచ్చు. ముందయితే నవ్వండి. దీన్నే పాజిటివ్ ఇంజెక్షన్ అంటారు. టెన్షన్ వల్ల మెదడులో రిలీజయ్యే 'కార్టిజాల్' జ్ఞాపక శక్తిని తగ్గిస్తుంది. అకస్మాత్తుగా మెదడు బ్లాంక్ అయిపోతుంది. 'కార్టిజాల్'కి వ్యతిరేకంగా పని చేసే మందు 'సెరొటొనిన్'. చిరునవ్వు వల్ల వస్తుంది. అందుకే పరీక్ష వ్రాసేటప్పుడూ, ఇంటర్వ్యూ సమయంలోనూ చిరునవ్వుతో ఉండాలి.
⮚
పరీక్ష హాల్లో కూర్చున్నాక కార్టిజాల్ ప్రభావం తగ్గించటానికి ఆక్సిజన్ (ఊపిరి) ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నించండి. పిడికిలి గట్టిగా బిగించి వదుల్తూ రిలాక్స్ అవ్వండి. పెన్ క్యాప్ తీసేముందు, కొంచెం సేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చెయ్యండి. పరీక్షకి కొత్త పెన్ వాడవద్దు. ప్రాక్టీస్ అయిన కలంతోనే వ్రాయండి. సూచనలతో సహా పరీక్ష పేపరు పూర్తిగా చదివిన తర్వాతే, జవాబులు వ్రాయటం ప్రారంభించండి. చివర్లో ఒక్కసారి సమాధానాలు సరి చూసుకోండి.
⮚
తెలుసు కాబట్టి సమాధానం ఎక్కువ వ్రాయవద్దు. మార్కుల బట్టి వ్రాయండి. వాక్య నిర్మాణం కరెక్టుగా ఉండేలా చూసుకోండి. Practice
good handwriting, underline key points in your answer with pencil after
completion of the paper.
⮚
పరీక్ష హాల్ నుంచి బయటకి వచ్చిన తరువాత ఆన్సర్ గురించి స్నేహితులతో చర్చించకండి. వాళ్ళు మీ ఫ్రెండ్సే కదా. మీ స్థాయి తెలివితేటలే వాళ్ళకీ ఉంటాయి. “నువ్వు వ్రాసింది కరెక్టు కాదు” అని నలుగురూ చెప్పారనుకోండి, మరుసటి రోజు పరీక్ష వ్రాయటానికి మూడ్ పోతుంది. అయినా వాళ్ళు చెప్పిందే కరెక్టని మీకెలా తెలుసు? మీరు రాసిందే కరెక్ట్ అవ్వొచ్చుగా. సరిగ్గా వ్రాస్తే మార్కులు వస్తాయి. లేకపోతే రావు. దాని గురించి చర్చించి ఏ లాభమూ లేదు - మనసు పాడవటం తప్ప.
⮚
పరీక్షలకి సంబంధించి ఆఖరుగా ఒక మాట. పేపర్లో నెంబర్ కనబడకపోతే, భరించలేనంత నిరాశ, నిస్పృహలు కలగటం సహజమే. దానికి కారణాలు ఇవి: 1) పాఠాలన్నీ మళ్ళీ చదవాలి 2) క్లాస్-మేట్స్ పై తరగతికి వెళ్ళిపోతారు. 3) జూనియర్స్ తో కలిసి చదవాలి. 4) స్నేహితులు, బంధువులు నవ్వుతారు. 5) తల్లిదండ్రుల ఆశలన్నీ కూలిపోతాయి. ఇవే కారణాలు. కానీ ఆలోచించి చూడండి. ఇవేమీ ఆత్మహత్య చేసుకొని జీవితాన్ని బలి పెట్టుకోవలసినంత పెద్ద కారణాలు కావే. ఆత్మహత్య చేసుకోవాలన్న కసినీ, దుఃఖాన్ని కొద్ది సమయం పాటూ వాయిదా వేసుకోగలిగితే అది తగ్గిపోతుంది.
⮚
చదవటం ఒక అలవాటుగా చేసుకోండి. ఏం? స్కూల్ లేని టైమ్లో మీరు ఆడటం లేదా? అలాగే హాలీడేస్లో కూడా కాసేపు చదవండి. మీ తాతగారి ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా సరే ప్రతిరోజూ ఒక అరగంట పుస్తకం తిరగేస్తే చదువుపట్ల ఆసక్తి కలుగుతుంది. వేసవి సెలవుల్లో సహ క్రమం తప్పకుండా చదవండి. పరీక్షల ముందు 'కాస్త' ఎక్కువ చదవండి. అంతే కానీ టెన్షన్ వద్దు. ప్రశ్నాపత్రం చూడగానే, "ఇదేమిటీ ఇంత సులభంగా ఉందీ క్వశ్చన్ పేపర్" అనిపించాలి. సబ్జెక్టుపై పూర్తి అధికారం ఉంటేనే ఆ ధీమా వస్తుంది.
⮚
ముందు రోజే పాఠం చదువుకుని (అర్థం కాకపోయినా) వెళ్లే, మరుసటిరోజు టీచర్ చెప్తున్నప్పుడు "అరె... ఇదంతా తెలిసిందే" అన్న ఫీలింగ్ మీపై మీకు నమ్మకాన్ని ఇస్తుంది. పాఠాన్ని ముందే చదవటం కష్టమే! కానీ ప్రయత్నించి చూడండి. రిజల్టు అద్భుతంగా కనబడుతుంది.
⮚
చెడు అలవాట్లు కొత్తగా ఆవుతున్నట్టు అనుమానం కలిగినా, మార్కులు తగ్గిపోతున్నా, బద్ధకం ఎక్కువ అవుతున్నా వెంటనే మీరు చెయ్యవలసింది - మీ గది వాతావరణాన్ని... దానికన్నా ముఖ్యమైనదీ, కష్టమైనదీ... మీ స్నేహ బృందాన్నీ వెంటనే మార్చెయ్యటం!
⮚
చదివే టైమ్ దగ్గరపడేకొద్దీ దాన్ని ఎలా వాయిదా వెయ్యాలా అనిపిస్తుంది. పని ప్రారంభించటానికి ముందుండే ఆటంకాల్ని 'రోడ్ బ్లాక్స్' అంటారు. చదువుకి ముందు తలనొప్పిగా అనిపించటం, చదువుకన్నా ముందు ఇంకేదో పని చెయ్యాలని అనిపించటం, గది వేడిగా ఉందన్న ఇబ్బంది... ఇవన్నీ ఉదాహరణలు. వీటిని ఎంత తొందరగా అధిగమించగలిగితే అంత మంచిది.
⮚
కార్పొరేట్ హాస్టల్ పిల్లలు రాత్రిపూట పుస్తకం ముందు కూర్చొని 'ఎందుకొచ్చిన చదువురా భగవంతుడా...' అని జోగినట్టు, మీలో మీరే వాపోవద్దు. అలా చేసే కొద్దీ చదువు ఒక శత్రువుగా కనబడటం ప్రారంభమవుతుంది. కొందరు పిల్లలు చదివేటప్పుడు కళ్ళార్పకుండా పుస్తకాల్లోకి బుషుల్లా చూస్తూ ఉంటారు. ఆలోచనలు మాత్రం ఎక్కడో ఉంటాయి. పోనీ ఆ విధంగా ఆనందంగా ఉంటారా అంటే అదీ లేదు. 'చదువుపై మనసు నిలవటంలేదే' అని మరో వైపు బాధపడుతూనే ఉంటారు. గడువుకు ముందే చదవాలనుకున్నదంతా అయిపోతే ఆ రాత్రి ఎంత హాయిగా నిద్ర పోవచ్చో ఒకసారి అనుభవంలోకి వస్తే, ఇక మీరు ఆ అలవాటు వదలరు.
⮚
సబ్జెక్ట్ గురించి ఏ అనుమానం వచ్చినా వెంటనే ఉపాధ్యాయుల్లో చర్చించి క్లారిఫై చేసుకోండి. లేకపోతే మీ సబ్జెక్టు ఒక భూతంలా మారుతుంది. ఎప్పటికప్పుడు క్లారిఫై చేసుకుంటూ ఉంటే సబ్జెక్టుపై ఇంటరెస్ట్ పెరుగుతుంది.
⮚
ఒక సబ్జెక్ట్ నుంచి మరోదానికి మారేటప్పుడు అయిదు నిమిషాలు విశ్రాంతి ఇవ్వండి. దాన్నే 'మైండ్ హాలిడే' అంటారు. పొరపాటున కూడా ఆ సమయంలో టీవీ చూడకండి.
⮚
రోజుకో రెండు కొత్త ఇంగ్లీషు పదాలు నేర్చుకోండి. వారానికి ఒక రోజు ఇంట్లో అందరితో ఇంగ్లీషులోనే మాట్లాడండి. మొదట్లో కొంచెం కామెడీగా ఉన్నా, అలవాటై పోతుంది.
⮚
"పొట్టిగా ఉన్నాను - నల్లగా ఉన్నాను. అందంగా లేను, డబ్బు లేదు" అన్న ఆలోచనలు ఏకాగ్రతని దెబ్బతీస్తాయి. లేని వాటి గురించి మర్చిపోండి. మీలో ఉన్న ఏదో ఒక కళని అభివృద్ధి చేసుకోండి. దీన్నే 'పాజిటివ్ థింకింగ్' అంటారు.
⮚
కోపం, దుఃఖం, అసూయ ఎక్కువగా ఉన్నవారికి చదువు సరిగ్గా రాదు. తగ్గించుకోవాలి. తప్పదు.
⮚
మీ అలవాట్లు చాలా వరకూ మీ స్నేహితుల మీదే ఆధారపడి ఉంటాయి. స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి.
⮚ స్నేహితులు
ఆరు
రకాలు:
o తెలివైనవారు - వీరి కంపెనీలో జ్ఞానం పెరుగుతుంది. కానీ వీరు కాస్త స్వార్థపరులుగా ఉంటారు.
o మంచివారు - వీరు ప్రాణం ఇస్తారు. ఆపదలో ఆదుకుంటారు.
o క్రిములు - మనకి తెలియకుండానే మనల్ని పాడుచేస్తారు. అయినా వీరి కంపెనీ బావుంటుంది. వీరి వల్లనే సిగరెట్లు, డ్రింక్స్ లాంటి చెడు అలవాట్లు అలవడతాయి.
o దొంగలు - మన స్నేహితుల్లాగే నటిస్తూ మన వస్తువులు కొట్టేస్తారు. వెనుక గోతులు తవ్వుతారు. అవసరానికి వాడుకొని తరువాత మాయమవుతారు.
o గడ్డిపరకలు - వీరివల్ల లాభమూ ఉండదు, నష్టమూ ఉండదు. కబుర్లకి తప్ప మరి దేనికీ ఉపయోగపడరు. సమయం మాత్రం వృధా అవుతుంది.
o హీనచరితులు - ఏ లాభమూ లేకపోయినా వీరు మన గురించి బయట చెడుగా మాట్లాడతారు. మనసు కష్టపెడతారు.
మీరు ఇందులో ఏ రకానికి చెందుతారు? మీ స్నేహితులు ఏ రకానికి చెందుతారు?
Sir iam hima bindhu from your school Kendriya vidyalaya 7th class in sixth class I got 10 rank because iam starting to that school but after following how to became a topper in all exams I got. 4 rank or 5 rank
ReplyDeleteVery happy to hear you that Hima bindhu, keep aim for 1st rank 👏👏
ReplyDelete